
కేంద్రానివి ప్రజావ్యతిరేక విధానాలు
● కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ ● 20న దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు
సంగారెడ్డి రూరల్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, అది ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో సంఘం జిల్లా కార్యదర్శి పి.అశోక్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాలతో 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు. మే 20న దేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు చేపట్టే సమ్మెకు సంఘీభావంగా సామాజిక తరగతులు దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.