
హామీలు అమలు చేయాలి
జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి భూ బాధితులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ మాట్లాడుతూ బూచినెల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కనే కోట్ల విలువైన పేదల భూములను ప్రభుత్వం పరిశ్రమల కోసం తీసుకుందన్నారు. పరిహారం కింద ఎకరాకు రూ.15 లక్షలు, 120 గజాల ఇంటి స్థలం, రైతుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగం, కాలుష్యంలేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఎకరాకు రూ. 3,50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని హామీలు అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఎకరాకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. లేకుంటే అందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయం అధికారి వంశీ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో బూచినెల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట
భూ బాధితుల నిరసన