కాంగ్రెస్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సమావేశం

May 5 2025 8:18 AM | Updated on May 5 2025 8:18 AM

కాంగ్రెస్‌ సమావేశం

కాంగ్రెస్‌ సమావేశం

ఇందిరమ్మ కమిటీల్లో బీఆర్‌ఎస్‌ నేతల ఆధిపత్యమేంటని నిలదీత
● పార్టీ పరిశీలకుడిని అడ్డుకున్నపటాన్‌చెరు కాంగ్రెస్‌ నాయకులు ● మంత్రి దామోదర ఎదుటే నిలదీసిన శ్రేణులు ● కాంగ్రెస్‌ జిల్లా ముఖ్య నేతలసమావేశం రసాభాస

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు.. అంతర్గత పోరు మరోమారు రచ్చకెక్కింది. మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గం నేతలు రచ్చ రచ్చ చేశారు. సమావేశం వేదిక వద్దకు దూసుకొచ్చి.. రామ్మోహన్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ముఖ్యనాయకులు సముదాయించినా నాయకులు పట్టించుకోలేదు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యా ప్తంగా ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా నాయకులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో గూడెం పెత్తనంపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రామ్మోహన్‌రెడ్డి వివరిస్తున్న క్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెత్తనం ఏంటని రామ్మోహన్‌ను ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఈ కమిటీలోఅసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నేతలను నిలదీశారు. రామ్మోహన్‌రెడ్డి ఎంత వారించినా వినలేదు. పోలీసులు సైతం నిలువరించే ప్రయత్నం చేశారు. వేదికపై ఉన్న ఎంపీ సురేష్‌షెట్కార్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ కలుగచేసుకుని సముదాయించడంతో కొంత మేర శాంతించారు.

స్వేచ్ఛే కాంగ్రెస్‌కు బలం.. బలహీనత

: మంత్రి దామోదర రాజనర్సింహ

కాంగ్రెస్‌ పార్టీకి స్వేచ్ఛే బలం, బలహీనత అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు.. నాయకుడు లేడు అన్నారు. పార్టీలో వర్గ విభేదాలు ఉండటం సహజమేనన్నారు. కానీ సమన్వయం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, తాలుకా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో.. సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే నాయకులకు బలమని, వారి కృషితోనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నారు. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు. వారిని కాపాడుకుంటామని చెప్పారు.

సమావేశంలో వేదికపై ఉన్న నాయకులను నిలదీస్తున్న పటాన్‌చెరు నియోజకవర్గం కార్యకర్తలు

గూడెం ఫొటోపై మరో నేత ఫొటో అతికించి..

ఈ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సమావేశం వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్యనేతల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఇందులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో ఏర్పాటు చేయడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఫ్లెక్సీపై మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫొటోను అతికించారు. సమావేశం జరుగుతున్న హోటల్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ గూడెం మహిపాల్‌రెడ్డి ఫొటోపై మరోనాయకుడి ఫొటోను అతికించడం చర్చనీయాంశంగా మారింది.

సేఫ్టీ కోసం గూడెంను తీసుకున్నాం

: ఎంపీ సురేష్‌ షెట్కార్‌

సమావేశంలో జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌షెట్కార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బెదిరింపులకు దిగారని, ప్రభుత్వం సేఫ్టీ కోసమే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు. ఇది అధిష్టానం నిర్ణయమని, ఎవరూ వ్యతిరేకంగా వెళ్లవద్దని సూచించారు. తన ఎంపీ నియోజకవర్గం బాన్సువాడలోనూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నానని అన్నారు. అక్కడ కూడా బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి నియోజకవర్గాల్లో రెండు వర్గాలకు సమ న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందిరమ్మ కమిటీలతో పాటు, ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ ఇరు వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యనాయకులు చొరవ చూపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement