
మాట్లాడుతున్న కలెక్టర్ శరత్
కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్: మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. భావితరాలకు మహనీయుల జీవిత చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పాటల పోటీలను నిర్వహించాలని సూచించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను, టీఎస్‌ఎస్ కళాకారులతో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. విగ్రహాల చుట్టూ పారిశుధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని, విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, వివిధ జెండాలను తొలగించాలని సూచించారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉత్సవాలు సజావుగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వాణి విశ్వనాథ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.