రెండు రోజులు..

● హడావిడిగా ఉపాధి హామీ సీసీ రోడ్ల పనులు ● మార్చి 31లోగా ప్రారంభించకపోతే నిధులు వెనక్కి ● కూలీల మస్టర్లు నమోదు చేస్తున్న సిబ్బంది

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది తంటాలు పడుతున్నారు. ఈ పనులు ప్రారంభించేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పుడు హడావిడిగా ఈ పనులను షురూ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అంటే మార్చి 31లోగా ప్రారంభించని పక్షంలో జిల్లాకు మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. దీంతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ఈ పనుల ప్రారంభానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయా సీసీ రోడ్లకు సంబంధించి లేబర్‌ కాంపోనెంట్‌ కింద ఉపాధి హామీ కూలీలు పనిచేసినట్లు మస్టర్లను ఉపాధి హామీ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నిధులు వృథా కాకుండా చూస్తున్నారు. కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియ పకడ్బందీగా జరగకపోవడంతో వచ్చిన నిధుల్లో కొన్ని ల్యాప్స్‌ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.

రూ.76 కోట్లు.. 952 సీసీ రోడ్లు

ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.76 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 952 సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో కొన్ని చోట్ల డ్రైనేజీలు, మెటల్‌రోడ్ల నిర్మాణం పనులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది జూలై నుంచి విడతల వారీగా పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. మొత్తం నాలుగు విడతలుగా పనులకు అనుమతులు ఇచ్చారు. కానీ వెంటవెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఇంత హాడావిడి పడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షించాల్సిన అధికారులు అలసత్వం కారణంగా పనులకు వెంటవెంటనే శ్రీకారం చుట్టలేదు. దీంతో ఇప్పుడు గడువు దగ్గర పడటంతో పనులు ప్రారంభించేందుకు తంటాలు పడుతున్నారు.

కూలీల పని దినాలనుబట్టి..

జిల్లాలో 647 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 4.12 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇందులో 2.34 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌గా పనులకు వెళ్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ కూలీలు పనిచేసిన రోజులను బట్టి మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు జనరేట్‌ అవుతుంటాయి. ఎక్కువ మంది కూలీలు పనిచేస్తే ఎక్కువ నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇలా జిల్లాకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో జనరేట్‌ అయిన రూ.76 కోట్లతో సీసీరోడ్లు, ఇతర పనులను చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఎప్పటికప్పుడు ఈ పనులను ప్రారంభిస్తే ఇలా గడువు దగ్గర పడినప్పుడు హడావిడిగా పనులు షురు చేసేందుకు తంటాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ పనుల ప్రారంభం, నిధులు ల్యాప్స్‌ విషయమై ‘సాక్షి’ పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌ను సంప్రదించగా స్పందించలేదు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top