నామినేషన్ల జోరు
రెండో విడత వివరాలు..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం నుంచి రెండో విడత ఘట్టం మొదలు కానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లు ఆహ్వానించగా తొలి రోజైన గురువారం145 నామినేషన్లు జీపీలకు రాగా, 119 నామినేషన్లు వార్డులకు అందాయి. శుక్రవారం రెండో రోజు జీపీలకు 203, వార్డులకు 688 నామినేషన్లు అందాయి. ఇక చివరి రోజైన శనివారం జీపీలకు 581 వార్డులకు 2,520నామినేషన్లు దాఖలయ్యాయి. నిజానికి సాయంత్రం ఐదు గంటలకే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయా గ్రామాల నుంచి అభ్యర్థులు భారీగా తరలిరావడంతో రిటర్నింగ్ అధికారులు నిర్ధేశిత సమయంలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి రాత్రి తొమ్మిది తర్వాత కూడా స్వీకరించారు. ఇదిలా ఉంటే నామినేషన్ల స్క్రూట్నీ, ఉపసంహరణపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. సొంత పార్టీలోనే ఉంటూ పోటీగా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి ఉపసంహరింపచేసే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మొండికేస్తున్న వాళ్లపై ఎమ్మెల్యేలు, ఇతర నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగనుంది. తొలి విడతలో ఎంపిక చేసిన స్థానాలకు 11న ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆయా పార్టీల మద్దతుతో రంగంలోకి దిగుతున్న అభ్యర్థులు ఒకవైపు ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయి కేడర్ సహా ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ జీపీల్లోనే పోటీ అధికం
పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ చెప్పుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఎక్కడిక్కడ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వెంచర్లు సహా భూముల క్రయ విక్రయాలు, ఐటీ, అనుబంధ రంగాల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జీపీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాలను ఎలాగైనా కై వసం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక, సామాజిక కోణంలోనూ ఆలోచించి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం కొంత మంది భూములు, ప్లాట్లను కుదువపెడుతున్నారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం పలు రకాల ఆఫర్లు ఇస్తున్నారు.
నేటి నుంచి రెండో విడత
చేవెళ్ల, కందుకూరు డివిజన్లు ఏడు మండలాల పరిధిలోని 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా మండలాల్లోని ప్రతి రెండు మూడు గ్రామాలకు ఒక రిటర్నింగ్ కేంద్రాన్ని ఎంపిక చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ సహా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమించారు. డిసెంబర్ 2 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 6 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 14న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ముగిసిన తొలివిడత ప్రక్రియ
చివరి రోజు తరలివచ్చిన అభ్యర్థులు
రాత్రి వరకు స్వీకరించిన అధికారులు
నేటి నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం
పంచాయతీల్లో ఎటు చూసినా ఎన్నికల సందడి
మండలం జీపీలు వార్డులు
శంకర్‌పల్లి 24 210
మొయినాబాద్ 19 166
చేవెళ్ల 25 218
షాబాద్ 41 325
ఆమనగల్లు 13 112
కడ్తాల్ 24 210
తలకొండపల్లి 32 272
నామినేషన్ల జోరు


