ఇక జీహెచ్‌ఏ!
గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధి విస్తరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ (జీహెచ్‌ఏ) ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేస్తోంది. జీహెచ్‌ఏ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో పురపాలకశాఖ ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి మెగా కార్పొరేషన్‌గా అవతరించడం ద్వారా ప్రపంచ శ్రేణి నగరాల సరసన హైదరాబాద్ చేరుతుందని, దీనికితోడు వివిధ గ్రాంట్లను కూడా పొందే అవకాశముంటుందని సర్కారు తొలుత భావించింది. అయితే.. బడా కార్పొరేషన్ ద్వారా పాలనా పరమైన ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో జీహెచ్‌ఏ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్‌ఏ పరిధిలోనే ఉంటాయి. జీహెచ్‌ఏ ఏర్పాటుతో పట్టణ పరిపాలన సులువు కావడంతో పాటు పౌర సేవలు మెరుగవుతాయి. క్రమబద్ధమైన జవాబుదారీతనం, పారదర్శకతకు అవకాశముంటుంది.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధ్యయనం
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) స్థానంలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ)ను ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో జీహెచ్‌ఏను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ ఉన్నతాధికారులు, సీనియర్ ఐఏఎస్‌లు జీబీఏ ఏర్పాటు, కార్యకలాపాలను అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం 712 చ.కి.మీ మేర విస్తరించి ఉన్న జీబీఏ పరిధిలో నార్త్ సిటీ, ఈస్ట్ సిటీ, సౌత్ సిటీ, వెస్ట్ సిటీ, సెంట్రల్ సిటీ.. ఇలా ఐదు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇదే విధంగా ఈ జీహెచ్‌ఏ పరిధిలో బహుళ స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లు కార్యకలాపాలు సాగిస్తాయి.
జీహెచ్‌ఏ ఏం చేస్తుందంటే..
స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ల కార్యకలాపాలను సమన్వయం చేయడం, పర్యవేక్షించడం ఈ అత్యున్నత సంస్థ విధి. మెట్రోపాలిటన్ ప్రణాళిక, రవాణా, పర్యావరణ నిర్వహణలను సమన్వయం చేస్తుంది. ఏకీకృత ప్రణాళిక, వికేంద్రీకృత పరిపాలన, పౌరుల భాగస్వామ్యాన్ని సమన్వయం చేస్తూ.. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. జీహెచ్‌ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను పర్యవేక్షిస్తుంది.
కార్పొరేషన్ల పరిధిలో పౌర సేవలు
జీహెచ్‌ఎంసీ పరిధి పెరగడంతో ఆస్తి పన్నులు, వినియోగదారుల చార్జీలు, అభివృద్ధి రుసుముల ద్వారా ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది. ఏకీకృత పట్టణ నిర్వహణ, పౌర సేవలు సమానంగా అందించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడనున్న స్వతంత్ర నగరపాలక సంస్థలు ఆస్తి పన్ను, స్థానిక ఆదాయం, పౌర సేవలను నిర్వహిస్తాయి. దీంతో సమర్థమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. దీంతో స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది.
200 చ.కి.మీ., లేదా 20 లక్షల జనాభాకుఒక కార్పొరేషన్
27 నగర, పురపాలక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్‌ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్‌ఎంసీని ఒకే కార్పొరేషన్ కింద కార్యాచరణ కష్టసాధ్యం. బహుళ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం వల్ల పరిపాలన ప్రజలకు చేరువ అవడంతో పాటు స్థానిక సమస్యలు సకాలంలో పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో 200 చదరపు కిలోమీటర్లు లేదా 20 లక్షల జనాభా. అంతకుమించి విస్తీర్ణం పెరిగినా, జనాభా మించినా పరిపాలనపరంగా ఆరోగ్యదాయకం కాదని, కార్యాచరణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పురపాలక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన మెగా జీహెచ్‌ఎంసీలో బహుళ కార్పొరేషన్ల ఏర్పాటు అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
200 చ.కి.మీ., 20 లక్షల జనాభాకు ఒక కార్పొరేషన్
పరిపాలన సౌలభ్యం, సమాంతర అభివృద్ధికి అవకాశాలు


