చాలా కాస్ట్‌లీ గురూ!
లోటుపాట్లు ఉండొద్దు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.
షాద్‌నగర్: సర్పంచ్ పదవికి కో అంటే కోట్లయినా వెచ్చిస్తామంటున్నారు బరిలో దిగిన అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏ మాత్రం వెరవడం లేదు.. స్థిరాస్తి వ్యాపార, పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొంది రాజధానికి అతి సమీపంలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలో పరిస్థితి ఇది. 1994లో అప్పట్లో షాద్‌నగర్ ఎమ్మెల్యే బక్కని నర్సింలు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కేవలం రూ.10లక్షలు. ఈ విషయాన్ని ఆయనే చెబుతుంటారు. 1999 ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే శంకర్‌రావు ఎన్నికల ఖర్చు రూ.50 లక్షలు దాటలేదు. ఇప్పుడు ఒక గ్రామానికి సర్పంచ్ కావాలంటే రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు ఖర్చు చేయాల్సిందే. కొన్ని చోట్ల అవసరమైతే ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధం అంటున్నారు.
ఆ పల్లెలు ప్రత్యేకం
షాద్‌నగర్ నియోజకవర్గం 1975లో పారిశ్రామిక ప్రాంతంగా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తర్వాత 2004 నుండి ఇక్కడ స్థిరాస్తి వ్యాపారాల జోరు పెరిగింది. షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ఉన్న ఈ మూడు మండలాల్లో స్థిరాస్తి వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ కొన్ని గ్రామాల్లో సర్పంచుల పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో పార్టీ మద్దతు నుంచి ఇద్దరు లేక ముగ్గురు పోటీలో ఉన్నారు. పార్టీ ఎవరిని నిర్ణయింస్తుందో తెలియదు కాని అభ్యర్థులు మాత్రం ఇప్పటి నుంచే పోటీకి సిద్ధమై నామినేషన్లు వేశారు. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట, లింగారెడ్డిగూడ, కిషన్‌నగర్, బూర్గుల, మొగిలిగిద్ద, రాయికల్, అన్నారం.. కొత్తూరు మండలంలోని మల్లాపూర్, ఎస్‌బీ పల్లి, మక్తగూడ, ఇన్ములనర్వ.. నందిగామ మండలం మామిడిపల్లి, చేగూరు, అంతిరెడ్డిగూడ, మేకగూడ, నందిగామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల ఖర్చు రూ.50లక్షల పైమాటే. కొన్ని గ్రామాల్లో రూ.కోటి దాటి కూడా ఖర్చు చేసేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పోటీ చేయాలని ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేని వారు వెనుకడుగు వేస్తున్నారు.
ఎందుకింత ఖర్చు
ఈ మూడు మండలాలు ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతానికి నెలవయ్యాయి. ఎలికట్ట – మొగిలిగిద్ద గ్రామాల పరిధిలో ఇటీవల పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్తూరు, నందిగామ మండలాల్లో పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఇక్కడ సర్పంచ్‌లుగా ఉండడం లాభదాయకమైన వ్యవహారం అన్న ఆలోచనలతో సర్పంచులుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో చాలా మంది అప్పులు చేసి సర్పంచ్‌లుగా ఎన్నికై ఆ తర్వాత చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడ్డారు. మరి కొందరు అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి నిధులు చేతికి అందక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది మాజీలు ఈ విడత పోటీ చేయకుండా ఆగిపోయారు. రియల్‌ఎస్టేల్ వ్యాపారులు, ఇతర సంపాదనలు ఉన్న మాత్రం ఈ సారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రిజర్వేషన్లు మహిళలకు ఉన్న చోట తమ భార్యలను, లేదంటూ తల్లులను రంగంలోకి దించుతున్నారు. మొత్తానికి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సర్పంచ్ పదవి కోసం వెచ్చించే ఖర్చు అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సర్పంచ్ పోటీకి కో.. అంటే కోట్లే..
పారిశ్రామిక ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్
ఎంతైనా ఖర్చుపెడతాం.. తగ్గేదేలేదంటున్న అభ్యర్థులు
వేడెక్కుతున్న పల్లె రాజకీయం
ఆశ్చర్యపరుస్తున్న ఎన్నికల ఖర్చు


