‘గ్లోబల్’ ఏర్పాట్లు
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వేగంగా చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే మార్గంలో శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై పెద్దమ్మ దేవాలయం నుంచి కొత్తూర్ గేట్ ఫ్యూచర్‌సిటీ రహదారి వరకు నేషనల్ హైవే అధికారులు తారు వేసే పనులు చేపట్టారు. ఫ్యూచర్‌సిటీ మార్గంలో ఇప్పటికే గ్రీనరీ ఉండగా అదనంగా మొక్కలు నాటే పనులను హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు తుక్కుగూడ ఓఆర్‌ఆర్ నుంచి వచ్చే మార్గంలో ఇరువైపులా కుండీల్లో నాటిన మొక్కలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు తమ పనుల్లో బిజీబిజీ అయ్యారు. మరోవైపు నిత్యం ఎవరో ఒక అధికారి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇబ్రహీంపట్నం: తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నంకు చెందిన చెనమోని శంకర్ ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం 4వ రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం శంకర్ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవి అప్పగించిన వారి ఆశలను వమ్ము చేయకుండా, మత్స్యకారుల, కార్మికుల సమస్యల పరిష్కరానికి అహర్నిశలు కృషిచేస్తానని తెలిపారు.
మొయినాబాద్: ఇందిరమ్మ కాలంలో దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడానికి కుట్రలు చేస్తోందని దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో సర్వేనంబర్ 218/1లో 6 ఎకరాల భూమిని కోళ్ల ఫారాల నిర్మించుకోవడానికి యాబై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ హయాంలో గ్రామానికి చెందిన 36 మంది దళిత కుటుంబాలకు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సర్వేనంబర్‌లోని మొత్తం ప్రభుత్వ భూమిని హెచ్‌ఎండీఏకు అప్పగించింది. దళితులకు కేటాయించిన భూములు సైతం అందులోనే కలిపి చదును చేస్తుండడంతో శనివారం దళితులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని.. ఇతరులకు కేటాయించొద్దని పట్టు బట్టారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదన చెప్పుకొంటామన్నారు. ఎట్టి పరిస్థితుత్లో భూములు వదులుకోమని తేల్చి చెప్పారు. భూములు గుంజుకోవాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
సాక్షి, సిటీబ్యూరో: ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించిన సజ్జనర్.. పది ప్రధాన ముఠాలకు చెందిన 86 మందిని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 126 కింద బైండోవర్ చేశారు. వచ్చే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు. బాండ్ రాసిచ్చిన కాలపరిమితిలోపు ఎవరైనా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్‌ను రద్దు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.అపూర్వారావు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
‘గ్లోబల్’ ఏర్పాట్లు
‘గ్లోబల్’ ఏర్పాట్లు


