ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలి
షాద్‌నగర్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. పట్టణంలోని ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులను గుర్తించాలని, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘం మండల అధక్షుడు దొడ్డి రవీందర్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మేకల వెంకటేశ్, రవికుమార్‌గౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, రాందాస్ పాల్గొన్నారు.
అలీనగర్ కాలనీలో చోరీ
డబీర్‌పురా: ఓ ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు ఆభరణాలు దొంగలించిన సంఘటన మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నూర్‌ఖాన్‌బజార్ అలీనగర్ కాలనీలో ప్రాంతానికి చెందిన మీర్జా ఆలంధార్ అలీ, సయ్యదా సకీనా యుస్రా రజ్వీలు దంపతులు. ఈ నెల 26న రాత్రి 10.30 గంటల సమయంలో ఆలంధార్ అలీ కుటుంబ సభ్యులు శుభాకార్యానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుందామని చూడగా 15 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఇంట్లోని అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మీర్జా ఆలంధార్ అలీ గురువారం మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


