
నాడు హామీ.. నేడు నిధుల లేమి
ఇతను బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన కంది రాజు. రాజుకు ఇద్దరు అమ్మాయిలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే ఇద్దరు అమ్మాయిల పేరిట రూ.30వేల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేస్తామని 2005లో అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రాజు, మంజుల దంపతులు పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అక్కరకు వస్తాయని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. కొత్త బాలికా సంరక్షణ పథకం–2005 పేరిట బాండ్ ఇచ్చారు. 18 ఏళ్లకు అంటే 2023లో రూ.1.20లక్షలు రావాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా రాలేదు. అధికారుల వద్దకు వెళ్తే ఆ పథకం లేదని బుకాయిస్తున్నారు. పెద్ద అమ్మాయికి పెళ్లి కూడా అయింది. చిన్న అమ్మాయి చదువుకుంటోంది. కానీ సర్కారు ఇచ్చిన బాలికా సంరక్షణ పథకం పత్రాలు దుమ్ము పట్టిపోతున్నాయి.
ఇతను బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నడిగొట్టు శ్రీని వాస్. భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పెళ్లి అయింది. చిన్నమ్మాయి ఇంటర్ చదువుతోంది. కానీ 2005లో ఇచ్చిన కొత్త బాలికా సంరక్షణ పథకం బాండ్ అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన రూ.1.20లక్షలు ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు. బాండ్‌ను జారీ చేసిన మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారుల వద్దకు వెళ్తే ఆ పథకం ఇప్పుడు లేదని చెబుతున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఈ పథకంలో ప్రయోజనం దక్కుతుందన్న ఆశతో ఉంటే.. సర్కారు మోసం చేసిందని శ్రీనివాస్ దంపతులు వాపోతున్నారు.

నాడు హామీ.. నేడు నిధుల లేమి