
దేశంలోనే అగ్రగామి ‘సెస్’
● సంస్థలో అక్రమాలు జరగలేదు ● సెస్ చైర్మన్ చిక్కాల రామారావు
సిరిసిల్లటౌన్:సహకార విద్యుత్ సరఫరా సంస్థ సిరిసిల్ల సెస్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సంస్థ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా సెస్‌లో అవినీతి జరిగిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఆఫీస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. సెస్‌లో అవినీతి జరగలేదన్నారు. గత పాలకవర్గం హయాంలో విద్యుత్ రూ.14కోట్ల డిమాండ్ ఉండేదని.. రూ.8 కోట్లు రెవెన్యూ వచ్చేదన్నారు. తమ హయాంలో విద్యుత్ డిమాండ్ రూ.22కోట్లకు, రెవెన్యూ రూ.18కోట్లకు పెంచినట్లు తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, పోల్స్ వేసినట్లు వివరించారు. లైన్ లాస్ లేకుండా చూసేందుకు కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో అధికలోడును అధిగమించేందుకు మూడు సబ్‌స్టేషన్లు అవసరం ఉన్నందున స్థల సేకరణ కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సెస్‌లో రిటైర్మెంట్ అయిన వారికి రీయింబర్స్‌మెంట్లు ఇవ్వద్దని ఎన్పీడీసీఎల్ జీవో జారీ చేసినట్లు తెలిపారు. సెస్ సంస్థ ప్రజలదని, అందరి సహకారంతో ముందుకు నడిపించడానికి వినియోగదారులు సహకరించా లని కోరారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా రిక్రూట్‌మెంట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్పీడీసీఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారానే పనిచేస్తున్నామన్నారు. కొత్తగా సిబ్బంది కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించా మని, త్వరలోనే నియామకానికి ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, వరస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, శ్రీనివాసరావు, హరిచరణ్‌రావు, నారాయణరావు పాల్గొన్నారు.