
భర్త వేధిస్తున్నాడంటూ భార్య నిరసన
ఒంగోలు టౌన్: వివాహమై 30 ఏళ్లయినా తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. భర్త పనిచేస్తున్న స్థానిక రాజాపానగల్ రోడ్డులోని యూనియన్ చెస్ బ్యాంక్ వద్ద అతని ఫొటోతో కూడిన ఫ్లెక్సీ పట్టుకుని ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వల్లభరావుపాలేనికి చెందిన ఇందిరకు ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన తొట్లెంపూడి పోలయ్యతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం కాగా, పోలయ్య ఒంగోలులోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 30వ తేదీ రిటైర్డ్ కాబోతున్నాడు. ఆయన కొంతకాలంగా ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ప్రస్తుతం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళతో ఉంటున్నాడని ఇందిర ఆరోపించింది. ఒంగోలు నగరంలోని సుజాతనగర్‌లోని ఓ ఇంట్లో ఆమెతో కలిసి సహజీవనం చేస్తూ తనను, పిల్లలను బయటకు గెంటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో విడాకులు కోరుతూ కోర్టులో కేసు కూడా వేశాడని తెలిపింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని, అతని సర్వీసు రికార్డులో తన పేరు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే పోలయ్యపై ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశానని, దిశ పోలీస్‌స్టేషన్‌కు రిఫర్ చేశారని తెలిపింది. తన భర్త మీద చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది.