ఆనాటి చిన్నపిల్లల చేష్టలే.. నేడు రాహుల్‌కు కష్టాలు తెచ్చాయా?

KSR Comment On Rahul Gandhi Latest Controversy - Sakshi

రాజకీయాలలో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. విచక్షణతో పాటు వివేచన అవసరం. అహంకారపూరిత ధోరణి కన్నా, అందరిని కలుపుకుని వెళ్లడం కావల్సి ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు విర్రవీగకూడదు. తనకు నచ్చనివారిపై కక్ష పెంచుకోకూడదు. ఇవన్ని సాధారణ సూత్రాలు. వీటిలో ఏ ఒక్క దానిని జాగ్రత్తగా పాటించినా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీకి ఇంత పెద్ద సంక్షోభం ఎదురయ్యేది కాదు. ఒక పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్షపడడం, తత్పలితంగా ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవడం తీవ్ర సంచలనమైనదే.  

గత రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలను గమనిస్తున్నవారికి, విశ్లేషిస్తున్నవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కేవలం తెలివితక్కువ అనండి లేదా అతి తెలివి అనండి .. వాటివల్లే రాహుల్ నష్టపోయారని తెలుస్తుంది. నిజానికి రాహుల్‌కు ఎదురైన ఈ అనర్హత వేటు అన్నది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక మెజిస్ట్రేట్ స్థాయి న్యాయాదికారో లేక జిల్లా స్థాయి న్యాయమూర్తో చేసే ఒక నిర్ణయం ఆధారంగా దేశంలో రాజకీయవేత్తలు తమ పదవులను కోల్పోయే పరిస్థతి రాకూడదు. 

ఇది రాహుల్‌ స్వయంకృతమేనా?
రాజకీయ నేతలు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎదుటి పక్షం వారిని వేధిస్తే, వారికి కూడా ఎప్పుడో అప్పుడు అదే ఎదురవుతుందని రాహుల్ అనుభవం చెబుతుంది. ఇప్పుడు జరిగిందంతా రాహుల్ స్వయంకృతం అంటే తప్పుకాదు.   రెండేళ్ల శిక్ష పడిన వారు ఎవరైనా ,వారు ప్రజాజీవితంలో ఏ పదవులలో ఉన్నా , వాటిని కోల్పోతారన్న నిబంధనే సరైనదా? కాదా అన్నది చర్చించాలి. అందులోను గతంలో ఇలా శిక్ష పడినవారికి మూడు నెలల్లో అప్పీల్‌లో ఉపశమనం లభిస్తే పదవి పోదన్న నిబంధనను న్యాయ వ్యవస్థ తొలగించిన తర్వాత దానికి దిద్దుబాటు చర్యలు జరిగాయి. 2013 లో ఆనాటి యూపీఎ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆద్వర్యంలోని మంత్రివర్గం ఆయా కేసులు అప్పీల్ లో ఉంటే పదవి పోరాదన్న సవరణ తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. 

నిజానికి అది ప్రజా స్వామ్యానికి అవసరం. నిజమే. ఎవరైనా క్రిమినల్ చర్యలకు పాల్పడే రాజకీయ వేత్తలు రాజకీయ పదవులలో ఉండకూడదన్న నిబంధనను వ్యతిరేకించరాదు. కాని దానికి కొన్ని పరిమితులు పెట్టకపోతే, కేవలం ఒక న్యాయమూర్తి నిర్ణయం ఆధారంగానే పదవులు పోయేటట్లయితే , ఇక అప్పీల్ కోర్టులు ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. అందుకే  నిర్దిష్ట గడువు పెట్టి ఆ కేసులను విచారించి శిక్షను ధృవీకరిస్తే, అప్పుడు పదవులనుంచి అనర్హులను చేసే పరిస్థితి ఉండాలి.  మన్మోహన్ సింగ్ ప్రభుత్వం  కొన్ని పరిణామాల రీత్యా చట్టసవరణ చేస్తే యువరాజుగా చెలామణి అవుతున్న రాహుల్ గాందీ కేవలం అహంభావ ధోరణితో ఆ ఆర్డినెన్స్ కాపీలను ప్రెస్ ముందు చించివేసి తానేదో హీరో అన్నట్లు పోజు ఇచ్చారు. అవినీతిపై తాను పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు.

అదే కొంపముంచిందా?
అప్పుడే చాలామంది ఆయనది పిల్ల చేష్టగా వ్యాఖ్యానించారు. అప్పట్లో యూపీఎ చైర్ పర్సన్‌గా  రాహుల్ తల్లి సోనియాగాంధీ వెలిగిపోతుండగా, రాహుల్ తన వంతుపాత్రను ఇలా పోషించేవారు. సూరత్‌లో జరిగిన పరువు నష్టం  కేసు విచారణలో సైతం రాహుల్ అంత తెలివిగా వ్యవహరించలేదని అంటారు. ప్రధాని మోదీతో సహా మోదీ అన్న పేరు ఉన్నవారందరిని ఉద్దేశించి దొంగలు అన్న ప్రసంగం ఆయన కొంప ముంచింది.

దీనిపై న్యాయమూర్తి అడిగినప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని అన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే ఎంత తెలివితక్కువ తనం అవుతుంది? అదే కనుక అప్పుడే రాహుల్ జాగ్రత్తపడి, తన ఉద్దేశం అది కాదని , మన్నించాలని కోరి ఉంటే ఈ కేసు ఇంతదాకా వచ్చేదికాదని కొందరి అభిప్రాయంగా ఉంది. ఈ వ్యవహారంలోనే కాదు, ఏపీ విభజన వ్యవహారంలోను, వైఎస్ మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిన తీరులోను రాహుల్ ఇమ్మెచ్యూరిటీ కనిపించిందని పలువురు కాంగ్రెస్ నేతలు అప్పట్లో అభిప్రాయపడేవారు. 

అలాగే కాంగ్రెస్ ఎంపీగా ఉండి, ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్న  వైఎస్ జగన్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించి , చివరికి రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ను  నామరూపాలు లేకుండా  చేసుకున్నారు. తత్ఫలితంగా దేశంలోనే కాంగ్రెస్ అధికారం కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. తనకు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వస్తే , దానిని కూడా వదలుకున్న పద్దతి అందరిని ఆశ్చర్యపరించింది. వీటన్నటి ఫలితమే రాహుల్ గాందీ తన రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి తమకు ఎంతో బలైమన అమేధీ సీటులో ఓడిపోయారు. ఈ ఓటమిని ముందుగానే పసికట్టారేమో తెలియదు కాని, కేరళలోని వయనాడ్ లో కూడా పోటీచేసి గెలిచారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా రాహుల్ గాందీ ఇప్పుడు ఆ సీటుకు కూడా అనర్హుడయ్యారు. 

ఈలోపే ఉప ఎన్నిక ప్రకటిస్తే..
అప్పీల్ లో ఏమవుతుంది?  ఏమి కాదు? అన్నది వేరే విషయం. ఆలోగా ఎన్నికల కమిషన్ ఆ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటిస్తే చేయగలిగింది ఏమీ లేదు. బీజేపీ కక్ష సాధింపు అని ఎన్ని విమర్శలు చేసినా , రాహుల్ టెక్నికల్ గా తప్పు చేయకుండా ఉండాలి కదా! గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితతో సహా ముప్పై మందికి పైగా అనర్హత వేటుకు గురయ్యారు. తాజాగా రాహుల్ గాంధీ ఈ జాబితాలో చేరవలసి వచ్చింది. ఏది ఏమైనా ఈ నిబందనను మార్చడం అవసరం అన్నది నిర్వివాదాంశం. రాహుల్ గాందీ విషయంలో గగ్గోలు పెడుతున్న కాంగ్రెస లేదా ఇతర విపక్ష నేతలు 2013లోనే దీనిపై శ్రద్దపెట్టి, రాబోయే పరిణామాలను ఆలోచించి ఉంటే , ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా! కాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో పాటు, ఆయన పార్టీ నాయకులు పలువురు బాసటగా ప్రకటనలు చేయడం విశేషమే.

కెసిఆర్ కుమార్తె కవితపై వచ్చిన ఆరోపణలలో ఈడి చేస్తున్న దర్యాప్తు నేపధ్యంలో వీరి ప్రకటనలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది.  గత కొంతకాలంగా కేంద్రం సిబిఐ,ఈడి వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగంచేస్తోందని ఆరోపిస్తున్న కెసిఆర్ తాజా పరిణామాల ఆధారంగా జాతీయ రాజకీయాలలో కొత్త సమీకరణకు  ప్రయత్నిస్తారేమో చూడాల్సి ఉంది. ఒకప్పుడు రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ వేరే కారణంతో అనర్హత వేటుకు గురైతే, రాహుల్ ఇప్పుడు ఇలా అనర్హులయ్యారు.ఇందిరాగాంధీ తన శక్తితో తిరిగి బౌన్స్ బాక్ అయ్యారు. మరి రాహుల్ కు అంత సీన్ ఉందా అన్నది సందేహమే!


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top