
బొట్టుపెట్టి చెబుతున్నా.. రోడ్డుపై చెత్త వేయొద్దు
కోల్‌సిటీ(రామగుండం): ‘మీకు బొట్టిపెట్టి చెబుతున్నాం.. ఇంట్లోని చెత్తను రోడ్డుపై, కాలువల్లో పోయకండీ.. పరిసరాలను అపరిశుభ్రంగా మార్చకండీ..’ అంటూ రామగుండం బల్దియాలో పారిశుధ్యంపై అధికారులు, సిబ్బంది వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. గురువారం పాత 11వ డివిజన్‌లో ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని వార్డు ఆఫీసర్ మంగ, పారిశుధ్య విభాగం సహాయ పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి విజ్ఞప్తి చేశారు. అలాగే చెత్త పోసిన ప్రాంతాల్లో మరోసారి పోయవద్దని కోరుతూ ముగ్గులు వేశారు.