
9న సింగరేణిలో సమ్మె
● కార్మికులందరూ పాల్గొనాలి ● కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు
గోదావరిఖని: వచ్చేనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. బుధవారం స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. నాలుగు కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పాతవాటినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రైవేటీకరణను ఎత్తివేయాలని అన్నారు. సింగరేణిలో కొత్త గనులు కేటాయించి సంస్థ భవిష్యత్ పెంచాలని పేర్కొన్నారు. సమ్మైపె విస్తృతంగా ప్రచారం చేయాలని, అన్నిగనులపై గేట్‌మీటింగ్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్‌టీయూ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజిరెడ్డి, కె.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.