
● తరలిస్తారా.. చావమంటారా..?
నివాసాల పక్కనే నిర్వహిస్తున్న కోళ్లఫారాల నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నాం.. వ్యాధుల బారిన పడుతున్నాం.. పిల్లలకు తిండి సైతం సహించడం లేదు.. తక్షణమే ఇక్కడ నుంచి కోళ్ల ఫారాలను తరలించి జీవించే హక్కు కల్పిస్తారా, లేదంటే సామూహికంగా చావమంటారా అంటూ బిరసాడవలస గ్రామానికి చెందిన పిల్లలు, పెద్దలంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. ఇప్పటికే 31 రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సుపరిపాలనలో తొలిఅడుగు అంటూ మెంటాడలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సైతం గిరిజనుల ఆందోళన, ఆవేదనను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై నిరసన తెలిపారు. తక్షణమే కోళ్లఫారాలు తరలించాలని, లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని గిరిజన నాయకులు సుకరయ్య, స్థానిక నాయకుడు రెడ్డి రాజప్పలనాయుడు హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గిరిజనుల దీక్షశిబిరాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన మంత్రి తీరును తప్పుబట్టారు. – మెంటాడ