
పడగ విప్పుతున్న మహమ్మారి
● జిల్లాలో 1264 మలేరియా పాజిటివ్ కేసులు
● సింగిల్ డాక్టర్లతో నడుస్తున్న పీహెచ్‌సీలు
● 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ
● గ్రామాల్లో వైద్యశిబిరాలు
అంతంతమాత్రమే
● దోమల తెరల పంపిణీ నిల్
సీతంపేట/పాలకొండ రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా మహమ్మారి పడగ విప్పుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా, అలాగే ఆశ్రమ, వసతిగృహాల్లో జ్వరాల బాధితులతో ఏజెన్సీలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వైరల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువవుతున్నాయి. ఈ సీజన్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు వరకు 1264 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక గణంకాలు చెబుతుండగా ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 42, ఆరోగ్య ఉపకేంద్రాలు 200 వరకు ఉన్నాయి. ముఖ్యంగా పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు ఇద్దరు చొప్పున ఉండాలి. ఒకరు మెడికల్ క్యాంప్ వెళ్లినా, మరొకరు పీహెచ్‌సీలో ఓపీ చూడాలి. 14 మంది వరకు వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు నామమాత్రంగానే అందుతున్నాయనే ఆరోపణలు న్నాయి. రోజుకు ఓపీ 50 నుంచి 100 మధ్య పీహెచ్‌సీల్లో ఉండగా, ఏరియా ఆస్పత్రుల్లో 200 నుంచి 300ల మధ్య ఉంటోంది. మారుమూల గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది. పీహెచ్‌సీల నుంచి ఏరియా ఆస్పత్రులకు రిఫరల్ కేసులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.
550 హైరిస్క్ గ్రామాలు..
జిల్లాలో 1250 పైన గిరిజన గ్రామాలున్నాయి. వాటిలో సుమారు 550 గ్రామాలను మలేరియా హైరిస్క్ గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగా ఈ గ్రామాల్లో మలేరియా కారక దోమల నివారణకు ఐఆర్‌ఎస్ 5శాతం ఏసీఎం ద్రావణాన్ని దశల వారీగా పిచికారీ చేస్తున్నారు. మలేరియా నివారణ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ జ్వరాల నివారణ చర్యలు చేపట్టినప్పటికీ మలేరియా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. జనవరి నుంచి ఇప్పటివరకు 1,31,902 మంది రక్తపూతలు సేకరించగా వాటిలో 1264 మలేరియా పాజిటివ్ కేసులు జూన్ నెలాఖరు వరకు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, చిన్నచిన్న క్లినిక్‌లు, గ్రామాల్లో సంచి వైద్యులు వంటి వారి వద్దకు వచ్చే మలేరియా పాజిటివ్ కేసులు ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి.
కాలం చెల్లిన దోమతెరలు..
దోమతెరల కాలపరిమితి ఐదేళ్లు. అయితే దోమతెరలను ఉతకడం వంటి పనులు చేస్తే మూడేళ్లకే పాడవుతాయని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో దోమతెర లకు కాలం చెల్లాయి. మరికొన్ని చినిగిపోయాయి. ఇప్పటికే పాడైన దోమతెరలను చాలా గ్రామాల్లో చేపలు పట్టడానికి, మొక్కలకు కంచె వేయడానికి వినియోగిస్తున్నారు.

పడగ విప్పుతున్న మహమ్మారి