
చందాలతో పాఠశాల షెడ్ నిర్మాణం
సాలూరు: పిల్లల బంగారు భవిష్యత్‌కు విద్య ఎంతో మూలమని గుర్తించి చందాలతో పాఠశాలకు రేకుల షెడ్డు నిర్మించిన విద్యార్థు ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దాతలకు పాదాభివందనాలు చేస్తున్నానని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు మండలంలో తోణాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో చందాలతో నిర్మించిన పాఠశాల రేకుల షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మువ్వల ఆదయ్య మాట్లాడుతూ ,ఈ పాఠశాల షెడ్ ప్రారంభోత్సవానికి రావాలని రాజన్నదొరను అడగ్గా, ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుందని తాను రానని రాజన్నదొర తిరస్కరించగా, ఈ పాఠశాల ప్రభుత్వ నిధులతో నిర్మించలేదని మా గిరిజనులు, దాతలు చందాలతో నిర్మించుకున్నదని చెబితే రాజన్నదొర వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తప్పుగా మాట్లాడితే మూల్యం తప్పదు
సాలూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇటీవల తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, సదరు నేతలు తగు మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండలంలోని తోణాం పంచాయతీ మెట్టవలసలో విలేకరులతో మాట్లాడుతూ, తమను రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నా ఇంతవరకు ఎంతో సంయమనంతో ఆగామని, ఇకఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజ్ఞత కోల్పోయి సంస్కారం లేకుండా మాట్లాడిన వారిపై కేసులు పెడతామన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలన్నారు.తాను ఏనాడూ తాను చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లతో పాటు స్దానిక మంత్రి సంధ్యారాణిని వ్యక్తిగతంగా దూషించలేదని పేర్కొన్నారు. పార్టీలు, వ్యవస్థలపై విమర్శించడం వేరని, వ్యక్తిగత విమర్శలు చేయడం వేరనే విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సువ్వాడ భరత్‌శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు మువ్వల ఆదయ్య, పీడిక సుదర్శనదొర, నూకయ్య, జన్ని సీతారాం, సుబ్బారావు,రఘుపాత్రుని సాంబమూర్తి, నెమలిపిట్ట కల్యాణ్, పెద్దింటిమాధవరావు, కొండగొర్రి ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభించిన మాజీ డిప్యూటీ
సీఎం పీడిక రాజన్నదొర