
ఎవరేమనుకున్నా.. అదే తీరు!
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం పురపాలక సంఘంలో పాలకవర్గంపై వివక్ష కొనసాగుతోంది. ఎవరేమనుకున్నా.. ఎన్ని విమర్శలు వస్తున్నా.. కూటమి నేతలు వారి మాటే శాసనంగా భావిస్తున్నారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలను కనీసం పాలకవర్గాన్ని పిలవకుండానే నిర్వహిస్తుండటం గమనార్హం. ఒక వార్డు కౌన్సిలర్ ఇంటి ఎదురుగా జరుగుతున్న పనులు.. సదరు కౌన్సిలర్‌కు కూడా తెలియకపోవడం విశేషం. పార్వతీపురం పట్టణంలోని ఎస్‌ఎన్‌ఎం కాలనీ, కుసుంగుడ్డి వీధి తదితర ప్రాంతాల్లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారులు, కాలువల నిర్మాణానికి గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాలకు మున్సిపల్ అధికారులు పాలకవర్గాన్ని ఆహ్వానించకపోవడం గమనార్హం.
తనకు తెలియకుండానే పనులు: చైర్‌పర్సన్
మున్సిపల్ పాలకవర్గానికి తెలియకుండానే వార్డుల్లో అభివృద్ధి పనులు చేయడమేమిటని చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని వాపోయారు. ఇదే విషయమై గతంలోనూ అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీనిపై కమిషనర్ వెంకటేశ్వర్లును శుక్రవారం నిలదీశారు. కనీసం ఆ వార్డు కౌన్సిలర్‌కు తెలియకుండా.. ఆయన ఇంటి ఎదురుగానే పనులు చేపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తామూ వార్డుల అభివృద్ధినే కోరుకుంటున్నామని, గౌరవప్రదంగా సమాచారం అందిస్తే తప్పేమిటని నిలదీశారు. పనులు జరిగినప్పుడు తాను లేనని.. ఆ విషయాలేవీ తనకు తెలియదని కమిషనర్ వెంకటేశ్వర్లు సమాధానమివ్వడం గమనార్హం.
‘పుర’ పాలకవర్గంపై కొనసాగుతున్న వివక్ష
చైర్‌పర్సన్‌కు తెలియకుండానే అభివృద్ధి పనులకు భూమిపూజ