
పెంపకం.. కావాలి అప్రమత్తం..!
రాజాం సిటీ/వేపాడ/గుమ్మలక్ష్మీపురం:
మానవ జీవనంలో జంతువులు సైతం భాగమయ్యాయి. మనిషి తన అవసరాల కోసం కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లు ఇలా రకరకాల జంతువులను పెంచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సరదాకు, ఇంటి కాపలాకు పరిమితమైన కుక్కల పెంపకం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. నేడు ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా ...
పెరుగుతున్న ప్రేమ..
జంతు ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రేమనైతే పంచుతున్నారుగాని వాటితో కలిగే వ్యాధుల గురించి పట్టించుకోవడంలేదు. వైద్య నిపుణుల పరిశోధన ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్ అంటారు. కుక్క కాటు ద్వారా రేబిస్, పందుల ద్వారా మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్ వ్యాధి ప్రమాదకరమైనదిగా వైద్యులు పేర్కొంటున్నారు.
జునోసిస్ ఎలా వచ్చిందంటే...
పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్ టీకాను ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. రేబిస్ టీకాను జూలై 6న కనిపెట్టడంతో ఆ రోజున ప్రపంచ జునోటిక్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
పిల్లల విషయంలో జాగ్రత్త...
పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్నారులు బయట తిరగకుండా చూసుకోవాలి. తమ పెంపుడు కుక్కలు బయట తిరిగే సమయంలో ఇతరులుపై దాడి చేయకుండా యజమానులు జాగ్రత్త పడాలి.
వ్యాక్సినేషన్ వేయించాలి
పెంపుడు జంతువులకు వేసే వ్యాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన ఉండదు. కొంతమంది ఖర్చుతో కూడినదని పట్టించుకోరు. పెట్స్‌కు మామూలుగా కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలి. మనిషి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరడం వంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. కుక్కలు, పిల్లలు పెంచుతున్న వారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి.
పెంపుడు జంతువులపై పెరుగుతున్న ఆసక్తి
జంతు సంక్రమిత వ్యాధులు వచ్చే అవకాశం
పెంపకంపై అవగాహన తప్పనిసరి
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
నేడు ప్రపంచ జునోసిస్ డే
వైద్యుల సలహాలు తప్పనిసరి
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్ డిసీజస్ అంటారు. ఎబోలా, బర్డ్ ఫ్లూ, రేబిస్, మెదడు వాపు వంటివి జునోటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో కుక్కలు పెంపకం చేపట్టిన వారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్ వేయకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు.
– డాక్టర్ బి.జయప్రకాష్,
ఏడీ, పశుసంవర్ధకశాఖ, రాజాం

పెంపకం.. కావాలి అప్రమత్తం..!