పాచిపెంట: గ్రామసభల్లో వచ్చిన మ్యుటేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. ఈ మేరకు పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో రెవెన్యూ సమస్యలపై శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు పీఓ హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. భూ సవరణలకు సంబంధించి మ్యుటేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో ప్రైవేట్ భూములతో పాటు గ్రామ సరిహద్దులు, నీటివనరులున్న భూములు, పోరంబోకు భూములకు కొలతలు వేసి కచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు, భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందన్నారు. రీ–సర్వేలో తప్పులు దొర్లకుండా పక్కాగా నిర్వహించాలని సూచించారు. మృతి చెందిన రైతుల మ్యూటేషన్లపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.రవి, ఆర్‌ఐ రమణారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.