
చంద్రబాబుపై ఫిర్యాదు
● ఎస్సీలను కుక్కపిల్లతో పోల్చిన సీఎం
పార్వతీపురం రూరల్: దళితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, మరణించిన దళితుడు సింగయ్యను కుక్కపిల్లతో పోల్చడం మొత్తం సమాజాన్నే కించపర్చేలా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన స్థానిక నాయకులతో కలిసి చంద్రబాబుపై పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన దళితుడిని సైతం కుక్కపిల్లతో పోల్చి అవహేళన చేయడం దారుణమన్నారు. చంద్రబాబుకు దళితులంటే ఆదినుంచి చిన్నచూపేనని, మృతి చెందిన వ్యక్తికి కూడా కనీస స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడు కాబట్టే కుక్కతో పోల్చుతూ హీనంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచారం కోసం అనేక మందిని పొట్టన పెట్టుకున్న పుష్కరాల ఘటనను గుర్తుచేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఏనాడూ తమ పార్టీనాయకులు బలహీన వర్గాలపై చేయలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, 13వ వార్డు సీనియర్ నాయకుడు నేతాజీ, రాజేష్, చింతగడ లక్ష్మి, నారాయణ, రాజ, రాజీవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.