బీమా భారం | - | Sakshi
Sakshi News home page

బీమా భారం

Jun 30 2025 4:23 AM | Updated on Jun 30 2025 4:23 AM

బీమా భారం

బీమా భారం

ఉచిత పంటల బీమా పథకానికి

మంగళం

పంటల బీమా ప్రీమియం రైతులే

చెల్లించాల్సిన పరిస్థితి

వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటలకు బీమా వర్తింపు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించింది

విజయనగరం ఫోర్ట్‌: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లు పూర్తయినా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేల పెట్టుబడి సాయం అందజేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైనా సాయం ఊసెత్తడం లేదు. మరోవైపు గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలి. లేదంటే విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం అందదు. జిల్లాలో సాగవుతున్న వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటల సాగు విస్తీర్ణం ప్రకారం చూస్తే రైతులపై రూ.6.19 కోట్ల భారం పడనుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం అందే దారి కనిపించక, మరోవైపు బీమా చెల్లింపునకు చేతిలో డబ్బులు లేక ఆవేదన చెందుతున్నారు. రైతన్నపై కూటమి ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని, తమ ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమనే ఇబ్బందులకు గురిచేస్తోందంటూ మండిపడుతున్నారు.

ఖరీఫ్‌లో నాలుగు పంటలకు బీమా వర్తింపు...

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో నాలుగు పంటలకు పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. నాలుగు పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లించుకోవాల్సిందే. వరి పంటకు హెక్టారుకు రూ.500, నువ్వు పంటకు హెక్టారుకు రూ.162.50, మొక్కజొన్నకు హెక్టారుకు రూ.412, పత్తి పంటకు హెక్టారుకు రూ.4,807 చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలో ఆయా పంటల సాగువిస్తీర్ణం ప్రకారం రైతులు రూ.6.19కోట్ల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో ఉచిత పంటల బీమా

నాకు మూడు ఎకరాల మెట్టు భూమి ఉంది. అందులో అరటి తోట సాగు చేస్తున్నాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నా తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించడం వల్ల తుఫాన్‌ సమయంలో పంట నష్టపోతే 50వేల పరిహారం అందింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం రైతులను కట్టుకోమంటోంది.

– గనివాడ సన్యాసినాయుడు,

రైతు, పెదమధుపాడ గ్రామం

రైతులే చెల్లించాలి

పంటల బీమా పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను రైతులే చెల్లించుకోవాలి. పంటల బీమా కడితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీమా వర్తిస్తుంది. లేదంటే ఆర్థిక సాయం అందే పరిస్థితి ఉండదు.

– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి

ఐదేళ్లూ ఒక్క రూపాయి కట్టలేదు..

జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియం ఒక్క రూపాయి కూడా మేము చెల్లించలేదు. అంతా ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో పరిహారం అందేది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. వరి పంట సాగుకు సిద్ధమవుతున్నాను. అధికారులు పంట బీమా ప్రీమియం చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే పరిహారం అందదంటున్నారు. ఇది రైతుకు ఆర్థిక భారమే. ప్రభుత్వమే స్పందించి ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. – రంధి దేముడు, రైతు పెదవేమలి గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement