
ప్రతి నెలా అనీమియా కమిటీ సమావేశం
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఇకపై ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. కమిటీ సమావేశంలో తీసుకున్న చర్యలు, తద్వారా వచ్చిన ఫలితాలపై ఇక నుంచి సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఇతర జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నిర్మించి అసంపూర్తిగా ఉన్న సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, బీహెచ్‌పీయులను వినియోగంలోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రధానంగా సీతానగరం, మామిడిపల్లి, శంబర పీహెచ్‌సీలో పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని, మిగిలిన భవనాలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. చిన్న చిన్న పనులు జరగక భవనాలు నిరుపయోగంగా ఉండడం సబబు కాదని, ప్రభుత్వం తప్పక నిధులు విడుదల చేస్తుందనే భరోసా కల్పించి ఆయా కాంట్రాక్టర్లతో పనులు త్వరగా చేయించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో మలేరియా కేసులు ఉండకూడదు
జిల్లాలో మలేరియా కేసులు ఉండడానికి వీల్లేదని, పోలియో, ఎయిడ్స్ మాదిరిగా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మలేరియా కేసులు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వారం తాగునీటి ట్యాంకులను పరిశీలించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అన్నారు. రోగుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్‌మోహనరావు, డీసీహెచ్‌ఎస్ డా.బి.వాగ్దేవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డా.కె.విజయపార్వతి, డా.పద్మావతి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.చలపతిరావు, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల వైద్యాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్