లూజు పత్తిని మాత్రమే తీసుకురావాలి
నాదెండ్ల: రైతులు నాణ్యత గల పత్తిని సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చి గరిష్ట మద్దతు ధర పొందాలని ఉమ్మడి గుంటూరు జిల్లా సీసీఐ ఏజీఎం సంజయ్ ద్వివేది చెప్పారు. గణపవరం శ్రీ వెంకటకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. బయ్యర్ రమేష్‌ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సూచనలు చేశారు. రైతులు ప్లాస్టిక్ సంచుల్లో పత్తిని తీసుకురావద్దని, సాధ్యమైనంత వరకూ లూజ్‌గా తీసుకురావాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పత్తిలో కలిసి నాణ్యత తగ్గడంతోపాటూ రైతులు ధరలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రతి సోమవారం నుండి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకూ పత్తి కొనుగోలు జరుగుతుందన్నారు. తేమ 8–12 శాతంలోపు ఉండాలన్నారు. తడిచిన పత్తి ఆరబెట్టుకోవాలని, గుడ్డికాయ ఉన్నట్లయితే విదిలించి మేలు రకం పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు. సంబంధిత రైతులు కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దిష్ట సమయానికి పత్తిని సీసీఐ కేంద్రానికి తరలించాలని సూచించారు.


