హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ విజేత ‘పశ్చిమగోదావరి’
పిడుగురాళ్లరూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలలో విజేతగా పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. పిడుగురాళ్ల మండలం జానపాడు శివారులోని తిరుమల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌కు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల జట్లు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఆక్స్‌ఫర్డ్స్ స్కూల్ డైరెక్టర్ బొల్లా గిరిబాబు మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతమైన తిరుమల ఆక్స్‌ఫర్డ్ స్కూలులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించటం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి జిల్లా జట్టు అద్భుతమైన ఆటను కనబరిచాయని ఆయన తెలియజేశారు. విజేత పశ్చిమ గోదావరి జిల్లా జట్టుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేష్, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, పల్నాడు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా హ్యాండ్‌బాల్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ షేక్ రాను హుస్సేన్, పీఈటీలు పాల్గొన్నారు.


