భయపెడుతున్న స్క్రబ్ టైఫస్
గుంటూరు మెడికల్: సాధారణ జ్వరం మాదిరిగా సోకి ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తున్న స్క్రబ్ టైఫస్‌తో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. మేడికొండూరు, చేబ్రోలు, వేజండ్ల, తుళ్లూరు, గుంటూరు అర్బన్ పరిధిలోని గోరంట్ల, ఇతర ప్రాంతాల్లో వ్యాధి బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి జ్వరంతో ప్రారంభమవుతోంది. జ్వరం వచ్చి మూడురోజుల వరకు తగ్గకుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. చిన్న నల్ల మచ్చ (దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్‌గా అనుమానించాలి. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చు.
వర్షాకాలంలో ఈ జ్వరాలు ఎక్కువ
సాధారణంగా స్క్రబ్ టైఫస్ కేసులు వర్షా కాలంలో ఎక్కువగా నమోదవుతాయి. జిల్లాలో ఒక్క వేసవి కాలంలో మినహా వర్షా కాలం, చలి కాలంలో కేసులు నమోదయ్యాయి. జ్వరంతోపాటు, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటాయి. అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. వాంతులు, తీవ్రమైన చలి, అలసట, దగ్గు, కళ్లు ఎర్రబడడం ఉంటాయి. శ్వాస సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధి సోకిన వారిలో సగం మందికి పైగా వీపు, ఛాతి, కడుపుపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. వాటిని నొక్కినప్పుడు మసక బారుతాయి. అనంతరం ఎరుపుగా మారతాయి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిలో చర్మంలో కొద్దిగా రక్తస్రావం కావచ్చు.
కీటకం ద్వారా సోకుతోంది
బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కలిగించే చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ఈ క్రమంలో దానిలో ఉండే లాలాజలం (ఓరిజెంటియా తుత్సుగముషి అనే బ్యాక్టీరియా) రక్తంలోనికి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు కుడుతుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది.
జిల్లా వ్యాప్తంగా 31 మందికి ఈ వ్యాధి
జ్వరాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు
శరీరంపై నల్ల మచ్చ గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి
చిగ్గర్ మైట్ (కీటకం) ప్రభావంతో స్క్రబ్ టైఫస్
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్


