
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన బాబు
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే రూ. లక్షా అరవై వేల కోట్ల అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని అందుకే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాను రిలీజ్ చేసిన వీడియో సందేశంలో కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రూ. 3,30,000 కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కల్పించారన్నారు. అలాగే కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, ప్రజలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారన్నారు.
ఐదేళ్లల్లో రాష్ట్రానికి ఇంత చేసి సగటునా ఏడాదికి రూ. 65 వేల కోట్లు మాత్రమే అప్పు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించా రన్నారు.
● చంద్రబాబునాయుడు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశారని మండి పడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ అనుకూల చానళ్లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. విపరీత అప్పులతో నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆఫ్రికా లోని సూడాన్ కంటే దారుణంగా ఉందన్నారు.
● ఎన్నికలకు ముందు విద్యుత్ బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచనని బీరాలు పలికిన చంద్రబాబు నేడు స్మార్ట్ మీటర్లతో రూ.వందలు వచ్చే కరెంట్ బిల్లులను రూ.వేలకు మార్చారన్నారు. దీంతో వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి, రెండవ నెలలో తమ ఇంటి కరెంట్ బిల్లు రూ. 6349లు వస్తే, కూటమి ప్రభుత్వంలో నేడు రూ.16,918లు కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. సంస్కరణలు అంటే ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నించారు.
ఏడాదిలో రూ.లక్షా అరవై వేల కోట్లు అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే..
అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజల
నడ్డి విరగ్గొడుతున్నారు
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి