అడుగడుగునా ‘నకిలీ’ పురుగులు! | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ‘నకిలీ’ పురుగులు!

Jul 3 2025 5:28 AM | Updated on Jul 3 2025 5:28 AM

అడుగడ

అడుగడుగునా ‘నకిలీ’ పురుగులు!

జె.పంగులూరు: ఖరీఫ్‌ సీజన్‌ వచ్చింది. రైతులను ఆకర్షించేలా కొత్త పురుగుల మందులు, విత్తనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ సీజన్‌లో వివిధ పంటలు సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అనుమతులు లేని కంపెనీలవి మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం మిర్చి, పత్తి, కురగాయల విత్తనాలను మార్టూరు, చిలకలూరిపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేస్తారు. జె.పంగులూరు మండల పరిధిలోని ముప్పవరంలో విత్తనాలు, పురుగుమందు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఈ విక్రయాలు సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

30 ఎకరాల్లో నష్టపోయిన రైతులు

ఏటా ముప్పవరం గ్రామంలో కొన్న రైతులు పలువురు నష్టపోతున్నారు. మూడేళ్ల క్రితం ముప్పవరం గ్రామ శివారులో పెద్ద ఎత్తున నకిలీ పురుగుల మందులు, ఎరువులను సీజ్‌ చేశారు. అధికారుల అండదండలతో నకిలీ దందా నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పురుగుల మందుల దుకాణదారులు బిల్లులు ఇవ్వకుండా తెల్లకాగితంపై రాసిస్తున్నారు. అయినా అధికారులు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది మండల పరిసర ప్రాంతాల్లోని ముప్పవరం, కొండమూరు, బైటమంజులూరు, జాగర్లమూడివారిపాలెం మొక్కజొన్న రైతులను అగస్త్య కంపెనీ నిలువునా ముంచింది. మండలంలో నాలుగు గ్రామాల్లో మొక్కజొన్న చేలల్లో కలుపు రావడంతో తొలగించుకునేందుకు ముప్పవరంలో హనుమాన్‌ ట్రేడర్స్‌ షాపు వద్ద అటరాజిన్‌ మందును తీసుకెళ్లారు. మందు వేసిన 15 రోజుల తర్వాత దాదాపు 30 ఎకరాల్లో పైరు ఎండుముఖం పట్టింది. ఆకులు ఎండిపోతూ, మచ్చలు పడి, ఎర్రగా మారిపోయింది. కొంతమంది రైతులు పైరును దున్ని మళ్లీ సాగు చేసినా ఆ పైరు కూడా ఇదే విధంగా వస్తోందని వాపోయారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● లైసెన్స్‌ లేని వ్యక్తులు, దుకాణాలు, దళారుల నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయకూడదు. సరుకు ల్యాబ్‌ నంబర్‌, తయారీ తేదీ, కాలపరిమితి గడువు, రకం, ఇలా అన్ని వివరాలు ఉండాలి. సంతకం చేసిన బిల్లును విక్రయదారుల నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి.

● సంచులు సీలు విప్పినట్లు లేదా విప్పి తిరిగి కుట్టినట్లు కనిపిస్తే వాటిని కొనరాదు. విత్తన బస్తాతో లభించే ట్యాగ్‌ను ఏడాదిపాటు భద్రంగా ఉంచుకోవాలి.

● వ్యవసాయ శాఖ అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, సహకారం సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి.

మార్కెట్లోకి ‘నకిలీ’ పురుగులు వచ్చేస్తున్నాయ్‌.. ఆరుగాలం శ్రమించే రైతన్న కష్టాన్ని దోచుకునేందుకు వేచి చూస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విషయంలో కాస్త ఏమరుపాటుగా ఉండి నకిలీవి కొనుగోలు చేస్తే నట్టేట మునగక తప్పదు. అటు డబ్బు, ఇటు సమయం మట్టిపాలు కావడం ఖాయం. అప్రమత్తతే అన్నదాతకు రక్షణ కవచంగా నిలవనుంది.

అన్నదాతలను ముంచేస్తున్న డొల్ల కంపెనీలు

మార్కెట్లో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు

నమ్మకంతో కొనుగోలు చేసి నష్టాలపాలవుతున్న రైతులు

కొనే సమయంలోనే అన్నివిధాలా అప్రమత్తత అవసరం

అనుమతి ఉన్న దుకాణాల నుంచి తీసుకుంటేనే మేలు

అడుగడుగునా ‘నకిలీ’ పురుగులు! 1
1/1

అడుగడుగునా ‘నకిలీ’ పురుగులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement