సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్‌చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్‌చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్‌లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
హెచ్‌ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
బాపట్ల: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే –2025 కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. మహిళలు క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహద పడుతుందని తెలిపారు.హెచ్‌ఐవీ,ఎయిడ్స్ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేపడుతోందని తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి షేక్ మొహమ్మద్ సాదిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బదిలీల నుంచి మినహాయించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయించాలని వైఎస్సార్ సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ ఆదివారం ఓప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 2017 ఆగస్టులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో స్థాన చలనం పొందిన వారిని ప్రస్తుత బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ విభాగంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాకుండా, అకడమిక్ ఇయర్స్ ప్రాతిపదికగా మే 31 నాటికి లాంగ్ స్టాండింగ్‌గా పరిగణించి బదిలీల్లో చేర్చుతున్నారని తెలిపారు. కేలండర్ ఇయర్స్ కాకుండా విద్యా సంవత్సరాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా 60 ఏళ్ల వయసు పైబడిన ఉపాధ్యాయులు సైతం బదిలీల్లో స్థాన చలనం పొందనున్నారని, ఇది వారికి తీవ్ర అన్యాయం కలిగించే విషయమన్నారు. ఒక అకడమిక్ ఇయర్‌లో 9 నెలలు పనిచేస్తే ఒక ఏడాదిగా పరిగణిస్తున్న విద్యాశాఖాధికారులు, 59 ఏళ్ల 10 నెలలు వయస్సు నిండిన వారిని 60 ఏళ్ల వయసు నిండిన వారితో సమానంగా పరిగణించకపోవడంతో అనేకమంది ఉపాధ్యాయులు మానసికంగా ఆవేదన చెందుతున్నారని అన్నారు. 60 ఏళ్లకు చేరువలో ఉన్న వయోధిక ఉపాధ్యాయుల వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వారిని బదిలీల నుంచి మినహాయించాలని కోరారు. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం