
మద్యం దుకాణం ఏర్పాటుపై నిరసన
తెనాలి రూరల్: స్థానిక మత్తెంశెట్టిపాలెంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ముత్తెంశెట్టిపాలెం ప్రధాన సెంటరు వద్ద మద్యం దుకాణాన్ని ఆదివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ ద్వారా పాత రత్నా టాకీసు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ముత్తెంశెట్టిపాలేనికి తరలించారు. ఆదివారం దుకాణాన్ని తెరవడంతో స్థానికులు వ్యతిరేకించారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు వద్దని ఆక్షేపించారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై నిరసన తెలుపడం సరికాదని, సంబంధిత ఎకై ్సజ్ అధికారులను, మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని సూచించారు. స్థానికులు మాత్రం ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు.