
46 గ్రాముల బంగారం, 169 గ్రాముల వెండి
నరసరావుపేటరూరల్: రాష్ట్రంలోని ప్రముఖ శైవపుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలిసియున్న శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీల లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో దేవదాయ ధర్మదాయశాఖ పరిశీలకులు కె.మంజూష పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేశారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి గురువారం వరకు 38 రోజులకుగాను ప్రధాన హుండీల ద్వారా రూ.21,49,127, అన్నదానం హుండీ ద్వారా రూ.1,10,625లు కలిపి మొత్తం రూ.22,59,752 వచ్చినట్లు ఈఓ తెలిపారు. గత సంవత్సరం హుండీల ఆదాయంతో పోల్చితే ప్రస్తుతం సుమారుగా 15 శాతం అదనంగా వచ్చినట్లు తెలిపారు. 46.800 గ్రాముల బంగారం, 169 గ్రాముల వెండి ఆభరణాలు, 40 అమెరికన్ డాలర్లు, రియాద్ ఒక్కటి, మెక్సికో పెసోస్ 100 వచ్చినట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ యల్లమంద బ్రాంచ్ మేనేజర్ ఏ.ఎస్.ఎన్.రసూల్ బ్యాంక్ సిబ్బంది, కోటప్పకొండ ఔట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది, సూపరింటెండెంట్ నాగిరెడ్డి, ఆలయ సిబ్బంది, శ్రీ సద్గురు సేవా సమితి నరసరావుపేట సేవక బృందాలు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘చేనేతన్న’
జాండ్రపేట రైల్వేస్టేషన్‌కు చేనేత చిహ్నం
చీరాలటౌన్: చీరాల అంటేనే చేనేతల ఖిల్లా. చేనేతలు అధికంగా ఉన్న చీరాలలో నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టే అందమైన చీరలు నేసిన చరిత్ర ఉంది. అటువంటి చీరాల చేనేతల ఖ్యాతిని రైల్వే అధికారులు గుర్తించారు. మండలంలోని జాండ్రపేట రైల్వేస్టేషన్‌ను నూతన హంగులతో రైల్వే శాఖ తీర్చిదిద్దింది. రోజుకు పది వరకు రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతుంటాయి. జాండ్రపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా సుందరంగా తీర్చిదిద్దిన జాండ్రపేట రైల్వేస్టేషన్ ముందు భాగంలో చేనేతలు మగ్గం నేస్తున్న ఫొటో ఏర్పాటు చేశారు. చేనేతలు అధికంగా ఉన్న చీరాల్లోని జాండ్రపేట రైల్వేస్టేషన్‌కు రైల్వే అధికారులు చేనేతల ఫొటోతో స్వాగతం పలికే చిత్రాన్ని ఏర్పాటు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
దుర్గమ్మకు
పుష్పార్చన వైభవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు గురువారం కనకాంబరాలు, ఎర్రగులాబీలతోపుష్పార్చన వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద ఉత్సవమూర్తికి ఆలయ అర్చకులు పుష్పా ర్చన నిర్వహించారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈఓ భ్రమరాంబ, ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో పుష్పార్చనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

