
గాంధీజీ విగ్రహం ధ్వంసం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డు గాంధీ నగర్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఒక యువకుడు ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తెలిసిన వెంటనే పార్టీలకు అతీతంగా నాయకులు సంఘటన స్థలానికి వెళ్లి ఖండించారు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విగ్రహాన్ని 1964లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడర్ ఆవిష్కరించారని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి పేర్కొన్నారు. దీనిని 1994లో స్వాతంత్య్ర సమరయోధుడు జగన్నాథ త్రిపాఠి పున ప్రతిష్ట చేశారన్నారు. అటువంటి చారిత్రాత్మక విగ్రహాన్ని మరలా పునః ప్రతిష్ట చేసేవరకు ఆందోళన చేస్తామన్నారు. దీంతో అక్కడే ఉన్న అన్ని పార్టీల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అమిత్ ప్రధాన్(బీజేపీ), సుమిత్ పూజారి (బీజేడీ), అఖిల్ బోత్ర, బృందావన పండా, పొరి సాహు, పిరోజ్ (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.