
హోటళ్లపై అధికారుల దాడులు
జయపురం: సబ్ డివిజన్ పరిధి కోట్‌పాడ్ ఎన్‌ఏసీలో హోటళ్లు, బేకరీలపై అధికారులు శనివారం దాడులు జరిపారు. హోటళ్ల వంట గదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు, వంట నూనె వినియోగించాలని, పరిశుభ్రత పాటించాలని కోట్‌పాడ్ ఎన్‌ఏసీ కార్యనిర్వాహక అధికారి కమలేష్ మహంతి హోటల్ యజమానులకు సూచించారు. దాడుల్లో శానిటేషన్ అధికారి సుధీర్ కుమార్ నందో, గోపీ మఝి తదితరులు పాల్గొన్నారు.
నారాయణరావు నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న పడాల నారాయణరావు(84) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారులు పి.శ్రీనివాస్, పి.శ్రీకాంత్, కుమార్తె పి.శ్రీదేవిలు విషయం రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుధీర్ పర్యవేక్షణలో మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి పి.సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్‌తో పాటు కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని కోరారు.