
యాత్ర పనులు సమీక్షించిన ముఖ్యమంత్రి
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర అంతిమ ఘట్టం చేరువ అవుతుంది. తొలి ఘట్టంలో చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో శ్రీ గుండిచా మందిరంలో సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర (బహుడా), స్వర్ణాలంకార దర్శనం, ఒధొరొ పొణా, నీలాద్రి విజే వంటి ప్రముఖ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ జగన్నాథుని రథ యాత్రలో ఇవి అత్యంత ప్రముఖమైన ఘట్టాలు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో సేవల్లో జాప్యం, తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర యంత్రాంగం సమన్వయంతో జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పనులకు సంబంధించి మంగళవారం పూరీ సర్క్యుట్ హౌసులో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల శారదా బాలి ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట మరణాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి, ప్రఽభుత్వ ప్రముఖ కార్యదర్శి, శ్రీమందిర్ ముఖ్య నిర్వాహకుడు (సీఏఓ), రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్, అగ్నిమాపక సేవల డైరెక్టరు జనరల్ పాల్గొన్నారు.