
కూల్చివేతలు సరికాదు
● వందేళ్లుగా జొరిగాంలో
నివాసముంటున్నాం
● కలెక్టర్‌కు వందలాది మంది
ప్రజల విజ్ఞప్తి
కొరాపుట్: వందేళ్ల నుంచి తాము నివసిస్తున్న గ్రామంలో పట్టాలేని నివాసాలను కూల్చివేస్తామని అధికారులు ప్రకటించడం సరికాదని నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి కేంద్రం ప్రజలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకు వినతిపత్రం అందజేశారు. ఇలా కూలుస్తూపోతే గ్రామంలో ఏ ఒక్క నివాసం కూడా ఉండదని పేర్కొన్నారు. తమకు ఇన్నేళ్లలో ఏనాడు అధికారులు నోటీసులు ఇవ్వడం గానీ, రావడం గానీ జరగలేదన్నారు. ఇప్పుడు హఠాత్తుగా చర్యలు చేపడతామంటున్నారని గిరిజనులు పేర్కొన్నారు. ఇదే సమయంలో గిరిజనులను తోడ్కోని వచ్చిన మాజీ ఎంపీ రమేష్ మజ్జి మాట్లాడుతూ ఇలా కూలుస్తూపోతే అనేక గ్రామాలు శ్మశానాల్లా మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా అక్కడి అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్నారని, ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ ఇలాంటి సమస్య జొరిగాంతో పాటు ఉమ్మర్‌కోట్, రాయిఘర్ సమితుల్లో ఉందన్నారు. అడవిని నమ్ముకొని గిరిజనులు జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూముల కోసమే గతంలో రాయిఘర్‌లో దళిత్ సమాజ్ ఏర్పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అటవీ ప్రాంతంలో గిరిజనుల నివాసాలు కూల్చితే సమస్య ఇంకా పెరుగుతుంది కానీ పరిష్కారమవ్వదని పేర్కొన్నారు.

కూల్చివేతలు సరికాదు