
కాలువలో మునిగి ఇద్దరు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి నిలిగూడ గ్రామానికి చెందిన ఇద్దరు కాలువలో మునిగి మృతి చెందారు. నిలిగూడ గ్రామానికి చెందిన లవ్ డేరా(40), శుక్ర ఫటకా(35) సోమవారం ఉదయం పొలం పని కోసం కాలువ దాటి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో కాలువ దాటుతూ నీటిలో మునిగిపోయారు. చీకటి పడినా వారు ఇళ్లకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఓ మృతదేహం కాలువలో కనిపించడంతో రైతులు మత్తిలి పోలీసులకు సమాచారం అందజేశారు. మత్తిలి ఐఐసి దేవి ప్రియదర్శిని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి కాలువలో వెతికించగా మొదట మహిళ మృతదేహం దొరికింది. మరికొంత దూరంలో రాళ్ల మధ్యన పురుషుడి మృతదేహం కనిపించింది. మృతదేహాలను మత్తిలి ఆరోగ్యకేంద్రానికి తరలించారు. పోలీసులు ప్రమాదకర మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

కాలువలో మునిగి ఇద్దరు మృతి