
60 కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి: గంజాయి తరలిస్తున్న ఇద్దరు పోలీసులకు చిక్కారు. వీరివద్ద నుంచి సుమారు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో పూజారిగూఢ గ్రామ సమీపంలో బలిమెల పోలీసులు ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేసిన వ్యక్తులు రెండు బైక్‌ల్లో రెండు బ్యాగ్‌ల్లో ఉంచి అక్రమంగా జయపురం తరలిస్తున్నారు. బలిమెల పోలీసులకు అందిన సమాచారంతో ఐఐసీ దీరాజ్ పట్నాయక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనాలపై వస్తున్న వారిని తనిఖీ చేయగా.. బ్యాగ్‌లో ఉన్న 60 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో ఇద్దరిని వెంటనే అరెస్టు చేశారు. పట్టుబడిన యువకులను కోరుకొండ సమితి ముదిలిగూఢ గ్రామానికి చెందిన తార గోలారీ, నాధ్ హంతాల్‌గా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. సుమారు మూడు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.