
జయపూర్ రైల్వేస్టేషన్లో సౌకర్యాల లేమి!
● ప్రయాణికుల పాట్లు!
కొరాపుట్: వర్షాకాలం వస్తే చాలు జయపూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడుతుంటారు. ఆదివారం సాయంత్రం జయపూర్ రైల్వే స్టేషన్లో హిరాఖండ్ రైలు ఎక్కడానికి వచ్చిన వందలాది ప్రయాణికుల బాధలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. పేరుకే పెద్ద స్టేషన్ అయినప్పటికీ ప్లాట్‌ఫారం మీద ఉండడానికి స్థలం లేదు. అతి పెద్ద ప్లాట్‌ఫారం ఉన్నా అందుకు తగ్గ షెడ్స్ లేవు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉన్న షెడ్‌లో జాగా లేకపోవడంతో ప్రయాణికులు రక్షించుకోవడానికి పాదచారుల వంతెన కింద, ఫుడ్ స్టాల్ ముందు నిల్చోవలసి వస్తుంది. దేశంలో రైల్వే ఆధునీకరణ జరిగినా ఇక్కడ మాత్రం చేపట్టలేదు. కనీసం రైళ్లు వచ్చి వెళ్లే సమాచారం తెలిపే డిస్‌ప్లే బోర్డు లేదు. చిన్న స్టేషన్లలో రైళ్లు బోగీలు ఆగే స్థలం చెప్పే బోర్డుల వ్యవస్థ కూడా లేకపోవడం దయనీయం. రైలు వస్తే ప్రయాణికులు బోగిల కోసం పరుగులు తీయాల్సిందే. ఈ స్టేషన్ మీదుగా విశాఖ పట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, రౌర్కెలాలకు పది రైళ్లు నడుస్తున్నాయి. సుమారు లక్షా 50 వేల జనాభా ఉన్న జయపూర్ పట్టణంతో పాటు సమీప వందలాది గ్రామాలు, ప్రక్కనే నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాల ప్రజలు ఇదే స్టేషన్ మీద ఆధార పడుతున్నారు. పక్క రెండు జిల్లాలలో ఎక్కడా రైల్వే లైన్ లేక పోవడంతో జయపుర్ మాత్రమే గత్యంతరం. ఇంతటి రద్దీ ఉన్న స్టేషన్లో రైలు ఎక్కలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సి ఉంటుంది.

జయపూర్ రైల్వేస్టేషన్లో సౌకర్యాల లేమి!