సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కంకిపాడు: సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. కంకిపాడులోని అయానా ఫంక్షన్ హాలులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశం బుధవారం జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశానికి సిద్ధాంతపరమైన రాజకీయాలు అవసరమన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా జాతీయ వాదం, దేశం ఎంతో ముఖ్యమన్నారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నాయకులు ఎప్పుడూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. బూతులు మాట్లాడటం సంస్కారం కాదని, అలాంటి నేతలకు పోలింగ్ బూతుల్లోనే సమా ధానం చెప్పాలని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన దేశాన్ని నిలిపిన ఘనత ప్రధాని మోదీదని పేర్కొన్నారు. 12 బహుళ జాతి కంపెనీలకు సీఈఓలుగా దేశ పౌరులు నిలవటం గర్వకారణమన్నారు. రాజకీయాల్లో వారసత్వాలు కాదని, జవసత్వం ఉండాలని స్పష్టంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంతో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. దేశంలో నక్సలి జాన్ని, టెర్రరిజాన్ని రూపుమాపటానికి అహ ర్నిశలు ప్రభుత్వం కృషి చేస్త్తోందన్నారు. బిహార్‌లో ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం: విజయవాడ కండ్రికలో ఉన్న ఏఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ నెల ఏడో తేదీన జూడో జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు జరుగుతాయని జూడో సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి డి.ఎన్. రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల స్థాయిలో జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 15 ఏళ్లు నిండిన బాల, బాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన బాల, బాలికలు ఆ రోజు ఉదయం పది గంటలకు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.


