ఉద్రిక్తతల నడుమ భవనాల కూల్చివేత
సీఎంను కలవకుండా అడ్డుకున్న పోలీసులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆ భవనాలు అక్రమ నిర్మాణాలు కాదు. ఆక్రమించి నిర్మించినవి అంకన్నా కాదు. చట్టబద్ధంగా ప్లాట్లను కొనుగోలుచేసి కష్టపడిన సొమ్ముతో ఇష్టపడి నిర్మించుకున్న ఆశల గూళ్లు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ భవనాలను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దశాబ్దాలుగా నివసిస్తున్న భవనాలను ఒక్కసారిగా కూల్చివేయ డంతో వాటి యజమానులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన నగరంలోని రామరాజ్యనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. గత ఎన్నికల సమయంలో ప్లాట్ల యజమానులకు అండగా ఉంటామని కూటమి నేతలు హామీలు గుప్పించారు. వాటిని కూల్చివేసే సమయానికి చేతులెత్తేశారు. ఉదయాన్నే భవనాలను కూల్చివేయగా, సాయంత్రం ప్లాట్ల కూల్చివేతపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం గమనార్హం.
విద్యాధరపురం రామరాజ్యనగర్ పరిధిలోని జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉన్న 42 ప్లాట్లలో ఉన్న బిల్డింగ్‌లను బుధవారం ఉదయం కూల్చివేశారు. మూడు దశాబ్దాలుగా శ్రీలక్ష్మీరామ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ, 42 ప్లాట్ల యజమానుల మధ్య న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయి. ప్లాట్ల యజమానులు ఎన్నికలకు ముందు దాదాపు మూడు నెలలకుపైగా టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో కూటమి నాయకులు వారికి మద్దతుగా నిలిచి, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూస్తామని హామీలు గుప్పించారు. ఈ నేప థ్యంలో విజయవాడ కోర్టు శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ కోర్టు కమిషన్, అమీనాలు భారీ పోలీసు బందోబస్తుతో బుధవారం ఉదయం ఏడు గంటలకే వచ్చి బిల్డింగ్‌లను జేసీబీలతో కూల్చివేశారు. 2.17 ఎకరాల స్థలాన్ని సొసైటీకి స్వాధీనం చేశారు. దీంతో సొసైటీ నిర్వాహకులు తమ స్థలం సరిహద్దుల మేరకు వెస్ట్ మిడోవిస్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిని మూసివేస్తూ అడ్డంగా గోడ కట్టేశారు. అలాగే ప్లాట్లకు వెళ్లే మెయిన్ రోడ్డు లోపల ఉన్న మరి కొన్ని అపార్ట్‌మెంట్లకు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేస్తూ గోడ నిర్మించారు.
కన్నీటిపర్యంతమైన ప్లాట్ల యజమానులు
మూడు దశాబ్దాలుగా ఇక్కడ బిల్డింగ్‌లు కట్టుకుని నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై 42 ప్లాట్ల యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్దాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి రూపాయీ రూపాయి కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని వాపోతున్నారు. తమ అపార్ట్‌మెంట్లకు దారి లేకుండా గోడలు కట్టేస్తే చిన్న పిల్లలు, పెద్దవారు ఎటు వెళ్లాలని అపార్ట్‌మెంట్లవాసులు ఆందోళన చెందుతున్నారు.
పోలీస్ బందోబస్తుతో వచ్చిన కోర్ట్ కమిషన్, అమీనా
కోర్టు ఉత్తర్వులతో 42 ప్లాట్లలో భవనాలు కూల్చివేత
శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పరమైన 2.17 ఎకరాలు
పలు అపార్ట్‌మెంట్లకు వెళ్లే దారులు సైతం మూసివేత
దిక్కుతోచని స్థితిలో 42 ప్లాట్ల ఓనర్లు
కూల్చివేతలపై సాయంత్రానికి సుప్రీం కోర్టు స్టే
42 ప్లాట్ల యజమానులు తమ గోడు వినిపించేందుకు రాత్రి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. అయితే వారిని మధ్యలోనే పోలీ సులు అడ్డుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగే ప్రజాదర్బార్‌కు వెళ్లి అక్కడ మంత్రి లోకేష్‌ను కలిసి సమస్యను అర్జీ రూపంలో అందించాలని పోలీసులు సూచించారని బాధితులు తెలిపారు.
ఉద్రిక్తతల నడుమ భవనాల కూల్చివేత


