జోగి కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వారి కుమారులను వేధిస్తోంది. అదే కేసులో జోగి రమేష్ కుమారులు, ఆయన సోదరుల కుమారులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జోగి రమేష్ కుమారులు రాజీవ్, రోహిత్‌తో పాటు, రాము కుమారులు రాకేష్, రామ్మోహన్ బుధవారం గురునానక్ కాలనీలోని తూర్పు ఎకై ్సజ్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కుమారులతో పాటు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా వచ్చారు.
అసలు నిందితులు టీడీపీ నేతలే..
కల్తీ మద్యం కేసులో అసలు నిందితులు టీడీపీ నేతలేనని దేవినేని అవినాష్ అన్నారు. కావాలనే జోగి రమేష్‌ను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. కేసు రిమాండ్ రిపోర్టులో అసలు జోగి రమేష్ పేరే లేదన్నారు. జనార్దనరావుతో బలవంతంగా తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించి జోగి రమేష్ పేరు చెప్పించారని విమర్శించారు. తంబళ్లపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేసి, కేసులో జోగి రమేష్, రాము పేర్లు చేర్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
అక్రమ కేసులు పెట్టారు
‘గతేడాది నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించారు. ఇప్పుడు నా తండ్రిని అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కక్ష కట్టార’ని జోగి రమేష్ పెద్దకుమారుడు రాజీవ్ అన్నారు. తామెప్పుడూ రాజకీయంగా బయటికి వచ్చింది లేదని, అయినా తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.


