కాసుల మేత.. అబద్ధాల పూత | - | Sakshi
Sakshi News home page

కాసుల మేత.. అబద్ధాల పూత

Jul 3 2025 4:38 AM | Updated on Jul 3 2025 4:38 AM

కాసుల

కాసుల మేత.. అబద్ధాల పూత

అది కార్పొరేషన్‌ స్థలం కాదు.. ఆ స్థలాన్ని గతంలోనే ఏపీఐఐసీకి కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో ఆ స్థలాన్ని ఏపీఐఐసీ నుంచి ప్రభుత్వం తీసుకుని ఆర్టీసీకి కేటాయించింది. ఆ స్థలంలో బస్టాండ్‌ నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన సైతం చేసింది. ఆ స్థలంలో చేపల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని విజయవాడ మునిసిపల్‌ కౌన్సిల్‌లో టీడీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ స్థలం కాకపోవడంతో ఆ ప్రతిపాదనను కౌన్సిల్‌ తిరస్కరించింది. చేపల మార్కెట్‌లో షాపుల కోసం రూ. లక్షల్లో వసూలు చేసిన టీడీపీ నాయకులు తమ పాచిక పారకపోవడంతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అబద్దాల ప్రచారానికి తెరతీశారు.

బస్‌స్టేషన్‌తో మహర్దశ

సింగ్‌నగర్‌ ప్రాంతంలో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బస్టాండ్‌ నిర్మిస్తే సింగ్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలైన అంబాపురం, నైనవరం, జక్కంపూడి, షాబాదు, నున్న, ఆగిరిపల్లి, అడవినెక్కలం, నూజివీడు పరిసర గ్రామాల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. విస్తరిస్తున్న సింగ్‌నగర్‌ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని బస్టేషన్‌ను ఇక్కడ ఏర్పాటుచేస్తే కచ్చితంగా ఈ ప్రాంతాలన్నిటికి మహర్దశ పడుతుంది.

– నేరెళ్ల శివప్రసాద్‌, సింగ్‌నగర్‌

ప్రజలందరికీ మేలు

సింగ్‌నగర్‌లో బస్‌స్టేషన్‌ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజ లు అందరికీ మేలు కలుగుతుంది. సింగ్‌నగర్‌ ప్రాంతంలో నివసించే నిరుపేదలు ఎంతో కొంత ఆర్థికంగా బలపడతారు. బస్టాండ్‌ వెంబడే ఐకానిక్‌ పార్కు రానున్న నేపథ్యంలో విజయవాడలో సింగ్‌నగర్‌ మరో వాణిజ్య వాడగా అవతరించే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి.

– సిరిశెట్టి రాజా, వాంబేకాలనీ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సౌకర్యార్థం బస్టాండ్‌ ఏర్పాటుకు నగరంలోని వాంబే కాలనీలో 2.02 ఎకరాలు కేటాయించారు. బస్టాండు నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేసి, శంకుస్థాపన చేశారు. బస్టాండ్‌ నిర్మించే వాంబేకాలనీ, అజిత్‌ సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా జనాభా ఉన్నారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచే నేరుగా హైదరాబాద్‌, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు బస్సులు నడపాలని నిర్ణయించారు.

టీడీపీ నాయకుల కాసుల వేట..

కూటమి అధికారంలోకి వచ్చాక బస్టాండ్‌కు కేటాయించిన స్థలంపై టీడీపీ నాయకులు కన్నేశారు. బీఆర్టీఎస్‌ రోడ్డు ప్రాంతంలో ఉన్న చేపల మార్కెట్‌ను అక్కడికి తరలించాలనే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే షాపుల నిర్వాహకులతో ఒక్కో షాపు కోసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. బస్టాండు స్థలంలో చేపల మార్కెట్‌ ఏర్పాటుకు కౌన్సిల్‌లో ప్రతిపాదన పెట్టారు. బస్టాండు కోసం కేటాయించిన స్థలం, పైగా కార్పొరేషన్‌కు చెందినది కాకపోవడంతో కౌన్సిల్‌ సమావేశం టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో ఈ స్థలాన్ని ఏపీఐఐసీకి కేటాయించారు. ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొని బస్టాండ్‌ కోసం ఆర్టీసీకి బదలాయించింది. ఆ స్థలం ప్రస్తుతం కార్పొరేషన్‌కు సంబంధించి కాదు. ఈ విషయాలు తెలిసినా అభివృద్ధిని అడ్డుకొంటున్నారని టీడీపీ నాయకులు ఆరోపణలకు దిగారు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..

బస్టాండుకు కేటాయించిన స్థలంలో చేపల మార్కెట్‌ ఏర్పాటు ప్రతిపాదనపై వాంబే కాలనీ, సింగ్‌ నగర్‌ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. అపార్టుమెంట్ల సముదాయం, రూ.12కోట్లతో నిర్మిస్తున్న ఐకానిక్‌ పార్కు, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో చేపల మార్కెట్‌ను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నగరం వెలుపల కాకుండా ఇళ్ల మధ్య చేపల మార్కెట్‌ ఏమిటని నిలదీస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఫుడ్‌ కోర్టా?

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది ప్రభుత్వాస్పత్రి వద్ద ఫుడ్‌ కోర్టు ఏర్పాటు కోసం కౌన్సిల్‌లో టీడీపీ చేసిన ప్రతిపాదనలపైనా నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ సమస్యతోపాటు అత్యవసర సమయంలో రోగులను తీసుకొచ్చే అంబులెన్స్‌లు ఆస్పత్రికి చేరకుండా ఆటంకం కలిగించే ఫుడ్‌ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనను కౌన్సిల్‌ తిరస్కరిస్తే అభివృద్ధికి అడ్డు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపణలకు దిగడంపై ప్రజల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.

గతంలో తిరస్కరించి.. ఇప్పుడు గగ్గోలు

విజయవాడ నగరం విస్తరించింది. ఇప్పుడు నగర అవసరాలకు నీరు సరిపోవడమే గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో నగర పాలక సంస్థకు ఐలా బకా యిలు చెల్లించకుండా, నీటి సౌకర్యం కల్పించాలనడంపైనే ప్రజల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. ఐలా పరిధిలోని జమాక్‌ గృహ సముదాయాలకు నీటి సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనను కౌన్సిల్‌ తిరస్కరించింది. కార్పొరేషన్‌కు డబ్బులు చెల్లిస్తే ఆ ప్రతిపానను పరిశీలిస్తామని కౌన్సిల్‌ పేర్కొంది. ఇది అభివృద్ధిని అడ్డుకోవడం ఎలా అవుతుందని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని ఈ గృహ సముదాయాలనకు నీటిని సరఫరా చేసే ప్రతిపాదనలను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కౌన్సిల్‌లో ప్రతిపాదనలు పెట్టి, తిరస్కరిస్తే గగ్గోలు పెట్టడం తగదనే భావన నగర ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

అక్రమ వసూళ్ల పర్వం సాగడంలేదని టీడీపీ నాయకుల దుష్ప్రచారం ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో చేపలమార్కెట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వీఎంసీ స్థలం కాకపోవడంతో టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించిన కౌన్సిల్‌ వైఎస్సార్‌ సీపీ హయాంలో వాంబే కాలనీలో బస్టాండ్‌ కోసం 2 ఎకరాలు కేటాయింపు రూ.2.5 కోట్ల నిధులు మంజూరుచేసి శంకుస్థాపన చేసిన వైనం

కాసుల మేత.. అబద్ధాల పూత 1
1/3

కాసుల మేత.. అబద్ధాల పూత

కాసుల మేత.. అబద్ధాల పూత 2
2/3

కాసుల మేత.. అబద్ధాల పూత

కాసుల మేత.. అబద్ధాల పూత 3
3/3

కాసుల మేత.. అబద్ధాల పూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement