
ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర కీలకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే వైద్యులను సమాజంలోని అన్ని వర్గాల వారు గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను మంగళవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లా డుతూ.. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమన్నారు. నిరంతరం ప్రజాసేవపై చిత్త శుద్ధి, అంకితభావంతో పనిచేసే వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఎంతో ప్రయాస పడి వైద్య విద్యను అభ్యసించి వ్యక్తిగత, కుటుంబ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచటానికి కృషి చేస్తున్న వైద్యులపై ప్రజలు, నాయకుల ధోరణిలో మార్పు రావాలన్నారు. ఆఖరి క్షణం వరకు రోగుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించే వైద్యులపై దాడులు సరి కాదని పేర్కొన్నారు.
విశిష్ట సేవలందించిన వైద్యులకు సత్కారం
జాతీయ డాక్టర్స్ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన పది మంది వైద్యులను మంత్రి సత్య కుమార్ యాదవ్ సత్కరించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మశ్రీవాత్సవ, ప్రస్తుత డీఎంఈ, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం, జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ఎ.అశ్విని కుమార్, కార్డియాలజిస్‌ల్టు డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, డాక్టర్ పి.భాస్కరనాయుడు, డాక్టర్ జి.భవానీప్రసాద్, న్యూరోసర్జన్ డాక్టర్ కె.సత్యవరప్రసాద్, డాక్టర్ ఎం. కృష్ణనాయక్, డాక్టర్ ఆర్.మురళీబాబూరావు, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ టి.భారతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, డీఎంఈ అకడమిక్ డాక్టర్ జి.రఘునందనరావు, మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్స్ డే సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు సత్కారం