
9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రాష్ట్ర కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందే తడవుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల, కార్మికుల పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. 8 గంటల పని విధానం కార్మికుల పోరాటాల ఫలితమని ప్రభుత్వానికి గుర్తు చేశారు. యాజ మాన్యాలకు సంపద సృష్టించాలనే పేరుతో 10 గంటలకు పని పెంచడం, మహిళలు కూడా రాత్రులు విధులు నిర్వహించవచ్చని నిర్ణయాలు చేయటం ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. ఏఐటీయూసీ డెప్యూటీ కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి, ఏఐఎఫ్టీయూ(న్యూ) రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు వెంకట సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రినాథ్ కుమార్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల పిలుపు