
అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
మచిలీపట్నంటౌన్: దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పోకడల కారణంగా ఎమర్జెన్సీ విధిస్తే నేడు దేశంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో అప్రకటిత ఎమ ర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆందో ళన వ్యక్తం చేశారు. బుట్టాయిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘ఎమర్జెన్సీ నాడు – నేడు’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. నాడు ఇందిరాగాంధీ తనకు ఎదురులేదని నిరూపించుకోవడానికి ఎమర్జెన్సీ విధిస్తే, నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో హిందువులు, ముస్లింలు పాతిపదికన విభజన తీసుకురావడానికి నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలను చైతన్య పరుస్తున్న గౌరీ లంకేష్, నరేంద్ర దంబుల్కర్ గోవింద పనసరే తదితరులను ఆర్‌ఎస్‌ఎస్ ముష్కరులు చంపేశారని ఆందో ళన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ సాయిబాబాకు కోర్టులో బెయిల్ ఇచ్చినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అత్యవసరంగా సమావేశ పరిచి బెయిల్ రద్దు చేయించి ఆయన జైలులో మగ్గిపోయేలా చేశారన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాంగ సవరణలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, పార్టీ నగర కమిటీ సభ్యుడు బూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.