
మల్కాపూర్‌లో ఉద్రిక్తత
● అక్రమ ఇంటి నిర్మాణాన్ని
తొలగించిన అధికారులు
● ఆత్మహత్యకు యత్నించిన కుటుంబీకులు
ఎల్లారెడ్డి: మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇంటి నిర్మాణం కూల్చివేతతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెద్దెడ్ల నర్సింలు (బీజేపీ మండల అధ్యక్షుడు) ప్రభుత్వ స్థలంలో రెండు గజాల, ఆరు అంగులాల స్థలం ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో సదరు ఇంటి యజమానికి నిర్మాణం నిలిపివేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఇంటి నిర్మాణం చేపట్టడంతో డీఎల్‌పీవో సురేందర్ శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయించారు. అంతకుముందు కూల్చివేతకు వచ్చిన అధికారులను ఇంటి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు అశోక్, రాకేష్, కృష్ణలు ఒంటిపై పెట్రోలు పోసుకోవడంతో పోలీసులు స్పందించి వారిపై నీరు పోసి, ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామంలోకి ఎవరు రాకుండా డీఎస్‌పీ శ్రీనివాసరావు, సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై మహేష్‌లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడు నర్సింలు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఇంటి నిర్మాణం కూల్చివేయించారని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమ నిర్మాణం చేయలేదని తన సొంత స్థలంలోనే నిర్మించుకున్నట్లు తెలిపారు.