
మోతాదు మేరకే ఎరువులు వాడాలి
వేల్పూర్: అధికారులు సూచించిన మోతాదు మేరకే ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరస్వామి రైతులకు సూచించారు. వేల్పూర్, పచ్చలనడ్కుడ, జాన్కంపేట్, మోతె, పడగల్, లక్కోర గ్రామాల్లోని గిడ్డంగులలో ఉన్న ఎరువుల నిల్వలను, రికార్డులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న సాగు విస్తీర్ణం, పంట దశ ఆధారంగా ఎరువులను ఇవ్వాలని, దానివల్ల యూరియా సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందన్నారు. మండలంలో దాదాపు 300 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందరాదన్నారు. మోతె గ్రామంలో మొక్కజొన్న పంటను పరిశీలించి ఎరువులు పిచికారి చేస్తున్న రైతులతో మాట్లాడారు. యూరియా అధికంగా వాడడం వల్ల పంటపై పురుగులు, తెగుళ్ల తాకిడి ఎక్కువ అవుతుందన్నారు. ఏవో శృతి, సొసైటి సిబ్బంది ఉన్నారు.