
అనుమతి లేని పాఠశాల సీజ్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో గల మార్కెట్ రోడ్డులో శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న పాఠశాలను ఎంఈవో నాగేశ్వరావు సీజ్ చేశారు. శుక్రవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనితో ఎంఈవో పాఠశాల అనుమతి పత్రాలను తనిఖీ చేసి చూడగా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించవద్దని సూచించారు. నేతలు రాథోడ్ జీవన్, వంశీ నాయక్ ఉన్నారు.
అటవీభూములను
ఆక్రమిస్తే కఠిన చర్యలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పరిధిలోని అటవీ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా అటవీ భూమిలోకి ప్రవేశించి చెట్లను, వాటి కొమ్మలను నరికినా, అటవీ భూమిని చదునుచేసినా, దున్నినా, అడవిలో దారులు ఏర్పాటు చేసినా, అటవీభూముల సరిహద్దులను చెరిపేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతోపాటు అటవీభూముల నుంచి ఇసుక, మొరం, రాళ్లు తరలించినా, వన్యప్రాణులను వేటాడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఉపయోగించిన జేసీబీ, ట్రాక్టర్, లారీ, ఆటో, బైక్ వంటి వాహనాలను సైతం సీజ్ చేస్తామని చెప్పారు.